Friday, September 4, 2026

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’.. జనసేన యువజన విభాగానికి అదే పేరు! పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవోడా..’ తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఈ గేయంలోని ‘జైకొట్టు’ పదం ఇప్పుడు జనసేన పార్టీ యువజన విభాగం పేరుగా మారింది. పార్టీ ఆవిర్భావం జరిగిన 12 ఏళ్ల తర్వాత జనసేన తొలిసారిగా ప్రత్యేక యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది.

‘జై కొట్టు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఆవిష్కరించారు. పార్టీతో అనుబంధం ఉన్న యువతను ప్రత్యేక వేదికపైకి తీసుకురావడంతో పాటు.. ముఖ్యంగా జెన్‌జీని పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుగ్గా భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

2014లో జనసేన ఆవిర్భావం

జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి యువత కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. సభలు, సమావేశాలు, ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటోంది. అయితే ఇంతకాలం జనసేనకు ప్రత్యేకంగా యువజన విభాగం లేదు.

వీర మహిళా విభాగం వంటి ప్రత్యేక నిర్మాణాల ద్వారా పార్టీ కార్యకలాపాలు కొనసాగాయి. ఇప్పుడు ‘జై కొట్టు’ పేరుతో యువజన విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పార్టీలోని యువతను ఒకే వేదికపైకి తీసుకురావడానికి జనసేన అడుగు వేసింది.

‘జై కొట్టు’ పేరే ఎందుకు?

జనసేన యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరు పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పదబంధం తెలుగు ప్రజలకు సుపరిచితమే. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవోడా..’ అనే గేయం ద్వారా ‘జైకొట్టు’ పదం ప్రజా చైతన్యం, ఉద్యమ స్ఫూర్తితో ముడిపడింది.

ఈ గేయాన్ని వేములపల్లి శ్రీకృష్ణ రచించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలంలో ఈ పాట ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. అనంతరం కూడా ‘జైకొట్టు’ అనే పదం ప్రజా చైతన్యం, ఉద్యమ భావనకు ప్రతీకగా వినిపిస్తూ వచ్చింది.

ఉద్యమ స్ఫూర్తి నుంచి రాజకీయ కార్యాచరణ వైపు..

తమ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరు పెట్టడం వెనుక ఇదే స్ఫూర్తి ఉందా? అనే చర్చ మొదలైంది. అయితే ఈ పేరును సదరు గేయం నుంచే తీసుకున్నట్లు జనసేన అధికారికంగా వెల్లడించలేదు.

అయినప్పటికీ ప్రజలను సమీకరించే పిలుపు, చైతన్యం, కార్యాచరణకు ప్రేరణ కలిగించే భావం ‘జై కొట్టు’ పేరులో కనిపిస్తోంది. జనసేన ఆవిర్భావం వెనుక కూడా ఉద్యమ నేపథ్యం ఉండటంతో.. కొత్త యువజన విభాగం పేరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.