Sunday, September 27, 2026

ఏపీ టూరిజానికి రెక్కలు.. 10 ప్రాంతాలకు సీ ప్లేన్ కనెక్టివిటీ!

📰 Generate e-Paper Clip

ఏపీ టూరిజానికి రెక్కలు.. 10 ప్రాంతాలకు సీ ప్లేన్ కనెక్టివిటీ!

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. పర్యాటక ప్రాంతాలను మరింత వేగంగా, సులభంగా అనుసంధానించేందుకు సీ ప్లేన్ సేవలను ప్రవేశపెట్టే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

PPP విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 10 కీలక ప్రాంతాలను ఎంపిక చేశారు. విజయవాడ బెర్మ్ పార్క్‌, శ్రీశైలం, విశాఖపట్నం, తిరుపతి రాయలచెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, అరకు జోలాపుట్‌, లంబసింగి తాజంగి రిజర్వాయర్‌, పోలవరం ప్రాంతాలు సీ ప్లేన్ నెట్‌వర్క్‌లోకి రానున్నాయి.

సీ ప్లేన్లు ల్యాండింగ్‌, టేకాఫ్‌ కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వాటర్‌డ్రోమ్‌ నిర్మాణానికి దాదాపు రూ.20 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ త్వరలో టెండర్లు పిలవనుంది.

ప్రాజెక్టును నిర్వహించేందుకు స్కైహోప్‌ ఏవియేషన్‌, మె హెయిర్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.

మొదటి దశలో విజయవాడ, శ్రీశైలం, విశాఖపట్నం, లంబసింగి, సూర్యలంక, కాకినాడలను ప్రాధాన్యంగా తీసుకునే అవకాశం ఉంది. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మిగిలిన ప్రాంతాలకు సేవలను విస్తరించనున్నారు.

ఇప్పటికే విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ట్రయల్ రన్‌ నిర్వహించారు. ఆ ప్రయోగంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా సీ ప్లేన్‌లో ప్రయాణించారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఉడాన్ పథకం ద్వారా కేంద్రం ఆర్థిక సహకారం అందించడంతో పాటు, ప్రారంభ దశలో ఆపరేటర్లకు నష్టాలు రాకుండా VGF ద్వారా మద్దతు ఇవ్వనుంది. దీంతో ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు కొత్త తరహా ఎయిర్-వాటర్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.

కేరళ, గుజరాత్‌ తర్వాత సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరనుంది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.