Friday, September 4, 2026

హస్తకళాకారులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ధరకే కలప, క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకులు

📰 Generate e-Paper Clip

అమరావతి: రాష్ట్రంలోని సంప్రదాయ, వారసత్వ హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు వాటిపై ఆధారపడిన కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో హస్తకళాకారులకు అవసరమైన ముడిసరకును అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించారు.

ముడిసరకు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొయ్య బొమ్మలు, వీణలు తదితర సంప్రదాయ కళాఖండాల తయారీదారులకు నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కేవలం రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కలపను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటివరకు ముడిసరకును సమకూర్చుకోవడంలో దళారులపై ఆధారపడాల్సి రావడంతో కళాకారుల ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వమే నేరుగా కలపను సరఫరా చేసే విధానం తీసుకురావాలని అటవీ శాఖ భావిస్తోంది. దీంతో దళారుల ప్రమేయం తగ్గడంతో పాటు కళాకారులకు ముడిసరుకు తక్కువ ధరలో లభించే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో అక్రమ కలప సేకరణకు అడ్డుకట్ట వేస్తూ, చట్టబద్ధంగా లభించే కలపను కళాకారులకు అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుల ఏర్పాటుకు ప్రణాళిక

సంప్రదాయ హస్తకళలకు అవసరమైన ముడిసరకును నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ‘క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకులు’ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే కళాకారులకు అవసరమైన కలప సులభంగా లభించడంతో పాటు వారి ఉత్పత్తి ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

సంప్రదాయ కళలను పరిరక్షిస్తూ వాటిని భావితరాలకు అందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు రాష్ట్రంలోని సంప్రదాయ కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.