మేడ్చల్: బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొండం ఆంజనేయులు ముదిరాజ్‌కు బాధ్యతలు దక్కాయి. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య నియామక పత్రాన్ని విడుదల చేయగా.. బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి శనివారం ఆంజనేయులకు అందజేశారు.
గ్రామస్థాయి కార్యకర్తగా మొదలైన రాజకీయ ప్రయాణం రాష్ట్ర స్థాయి బాధ్యతల వరకు చేరుకోవడం పట్ల ఆంజనేయులు ముదిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతను పదవిగా కాకుండా రైతాంగానికి సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు.
ఆంజనేయులు ముదిరాజ్ రాజకీయ ప్రస్థానం గ్రామ శాఖ అధ్యక్షుడిగా ప్రారంభమైంది. అనంతరం యువ మోర్చా మండల కార్యదర్శి, జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2020 నుంచి 2024 వరకు మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.
పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేశారు.
గిర్మాపూర్ ప్రాంతంలో రైతు సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, కౌన్సిలర్ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున ప్రచారం, సమన్వయం చేపట్టారు.
రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్యకు, తన రాజకీయ ప్రస్థానంలో సహకరించిన కొంపల్లి మోహన్ రెడ్డికి ఆంజనేయులు ముదిరాజ్ ధన్యవాదాలు తెలిపారు.
రైతుల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ రంగ సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేయడానికి కృషి చేస్తానన్నారు.
రైతుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తానని.. రైతాంగాన్ని సంఘటితం చేసి బీజేపీ కిసాన్ మోర్చాను మరింత బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.
గ్రామస్థాయి కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రయాణానికి రాష్ట్ర స్థాయి బాధ్యత దక్కడం కార్యకర్తల కృషికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.


