Tuesday, September 29, 2026

పాక్ నేవీ నౌక ఢీకొట్టిందా? భారత్ తీవ్ర నిరసన.. పాక్ రాయబారికి సమన్లు

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన నౌకను పాకిస్థాన్‌ నేవీ నౌక ఢీకొన్న ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్‌ హైకమిషన్‌ చార్జ్‌ డి అఫైర్స్‌ సాద్‌ అహ్మద్‌ వారైచ్‌ను బుధవారం భారత విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది.

పాకిస్థాన్‌ నౌకాదళ యూనిట్‌ వ్యవహరించిన తీరు “ఆమోదయోగ్యం కానిది, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధం” అని భారత్‌ స్పష్టం చేసింది.

ఉత్తర అరేబియా సముద్రంలో ఘటన

సెప్టెంబరు 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన జరిగినట్లు భారత వర్గాలు తెలిపాయి. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకకు పాకిస్థాన్‌ నౌక వేగంగా సమీపించిందని, అనంతరం సురక్షితం కాని రీతిలో దిశ మార్చుకుంటూ రావడంతో ఢీకొన్నట్లు పేర్కొన్నాయి.

ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని భారత వర్గాలు తెలిపాయి.

1991 ఒప్పందాన్ని ప్రస్తావించిన భారత్‌

పాకిస్థాన్‌ నౌక వ్యవహరించిన తీరు 1991లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలకు ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్‌ 10కు విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్థాన్‌ సైనిక యూనిట్లు సముద్రంలో తగిన జాగ్రత్తలు పాటించాలని భారత్‌ సూచించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను కచ్చితంగా గౌరవించాలని స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని ఆ దేశ రాయబారికి భారత్‌ సూచించింది.

ఇదే సమయంలో ఇస్లామాబాద్‌లోని భారత చార్జ్‌ డి అఫైర్స్‌ కూడా పాకిస్థాన్‌ విదేశాంగ శాఖకు అధికారికంగా నిరసన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.