ప్రసవం కోసం వస్తే.. గాంధీకి రెఫర్? మేడ్చల్‌లో వైద్య సేవలపై ఆరోపణలు
మేడ్చల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ప్రసవ సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ప్రసవం కోసం వచ్చే గర్భిణులను స్థానికంగానే ప్రసవం చేయకుండా గాంధీ ఆసుపత్రికి తరలించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా ప్రసవం సమీపించిన ఓ గర్భిణీని మేడ్చల్ నుంచి 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా బోయినపల్లి వద్ద అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. దీంతో 108 సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో ప్రసవం చేయించి, తల్లీబిడ్డలను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ వైద్య సేవలపై ఆధారపడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇటువంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రసవ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ గర్భిణులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రసవ సేవలు, వైద్య సిబ్బంది అందుబాటు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


