శ్రీచైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దాడి.. ర్యాగింగ్ ఆరోపణలు
మేడ్చల్ మల్కాజ్‌గిరి: దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డికి చెందిన అభిషేక్‌పై రాత్రి సమయంలో సుమారు 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసి.. బూట్లతో ముఖంపై తొక్కినట్లు అతడి తల్లిదండ్రులు ఆరోపించారు.
దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెట్లపై నుంచి కిందపడటంతో గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం తమకు ఫోన్‌లో సమాచారం ఇచ్చిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. వెంటనే పాఠశాలకు చేరుకుని కుమారుడిని ఇంటికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

అయితే తనపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని అభిషేక్ తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
తమ కుమారుడిపై దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు.. ఘటనను బయటకు రాకుండా దాచేందుకు ప్రయత్నించిన పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


