తెలంగాణ అసెంబ్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
నిన్న ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద జరిగిన ‘చావుడప్పు’ నిరసనల అంశాన్ని బీఆర్ఎస్ సభ్యులు సభలో లేవనెత్తారు. ఈ అంశంపై ఆందోళన చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
బీఆర్ఎస్ సభ్యులు దాదాపు గంటసేపుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. సభ సజావుగా సాగేందుకు వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
సభ తీర్మానాన్ని ఆమోదించడంతో కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ సభ్యులను ప్రస్తుత సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ అసెంబ్లీ సమావేశాలు జరిగే అన్ని రోజులకు వర్తించనుంది.
సస్పెన్షన్ నిర్ణయం అనంతరం సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.


