Sunday, September 27, 2026

హైదరాబాద్‌కు ప్రమాద ఘంటికలు.. విపత్తులను తట్టుకోలేని నగరాల్లో రెండో స్థానం!

📰 Generate e-Paper Clip

అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌కు అంతర్జాతీయ అధ్యయనం షాకింగ్ హెచ్చరికలు జారీ చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం తక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మరో భారత నగరం అహ్మదాబాద్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

‘ఆల్ఫాజియో’ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచంలోని పలు నగరాలు ఎదుర్కొంటున్న ప్రకృతి విపత్తుల ముప్పు, వాటిని ఎదుర్కొనే మౌలిక వసతులు, సన్నద్ధత వంటి అంశాలను విశ్లేషించారు. ఇందులో హైదరాబాద్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, వరదలను తట్టుకునే స్థాయిలో మౌలిక వసతులు లేవని నివేదిక పేర్కొంది.

అహ్మదాబాద్ భారీ వరదల ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థలు తగినంతగా లేవని అధ్యయనం హెచ్చరించింది.

టాప్-10లో ఆసియా నగరాలే అధికం

విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత తక్కువగా ఉన్న ప్రపంచంలోని టాప్-10 నగరాల్లో తొమ్మిది ఆసియాలోనే ఉండటం గమనార్హం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన నగరాలు ఈ జాబితాలో అధికంగా ఉన్నాయి.

అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత పాకిస్థాన్‌లోని ముల్తాన్, బంగ్లాదేశ్‌లోని ఢాకా, పాకిస్థాన్‌లోని లాహోర్, భారత్‌లోని కోల్‌కతా, పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్, కరాచీ, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగరాలు ఉన్నాయి.

షికాగో అత్యంత సురక్షితం

మరోవైపు విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధతలో అమెరికాలోని షికాగో ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా నిలిచింది. ఆ తర్వాత ఇథియోపియాలోని అడిస్ అబాబా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, స్పెయిన్‌లోని బార్సిలోనా, ఫ్రాన్స్‌లోని ప్యారిస్ ఉన్నాయి.

‘సురక్షిత నగరం’ అంటే అక్కడ విపత్తులు సంభవించవని కాదని, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ఆ నగరాలకు ఉందని ఆల్ఫాజియో వ్యవస్థాపకుడు పరాగ్ ఖన్నా వివరించారు.

నగరాలు తమ మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటే విపత్తుల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని ఆయన సూచించారు. వేసవి తీవ్రతను తట్టుకునేందుకు పవర్ గ్రిడ్లను పటిష్టం చేయడంతో పాటు, వరదలను నియంత్రించేందుకు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.