బ్యాంకు లాకర్లో బంగారం భద్రపరుచుకునే విషయంలో ఆర్బీఐ ఎలాంటి గరిష్ఠ పరిమితిని విధించలేదు. అంటే లాకర్ సామర్థ్యానికి అనుగుణంగా ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు.
అయితే లాకర్లో ఉన్న బంగారానికి బ్యాంకు బాధ్యత విషయంలో కీలక పరిమితి ఉంది. బ్యాంకు నిర్లక్ష్యం, చోరీ, అగ్నిప్రమాదం లేదా సిబ్బంది మోసం వంటి కారణాలతో నష్టం జరిగితే.. లాకర్ వార్షిక అద్దెకు గరిష్ఠంగా 100 రెట్లు మాత్రమే పరిహారం లభిస్తుంది.
ఉదాహరణకు ఏడాదికి రూ.3,000 లాకర్ అద్దె చెల్లిస్తే.. నష్టం జరిగిన సందర్భంలో గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు మాత్రమే పరిహారం లభించే అవకాశం ఉంటుంది.
అందుకే భారీ విలువైన బంగారం ఉన్నవారు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఇంట్లో బంగారం విషయంలో ఆదాయపు పన్ను మార్గదర్శకాల ప్రకారం.. వివాహిత మహిళ 500 గ్రాములు, అవివాహిత మహిళ 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండటంపై సాధారణంగా వివరణాత్మక పరిమితులు సూచించబడ్డాయి. అయితే బంగారం కొనుగోలు బిల్లులు, వారసత్వ పత్రాలు లేదా ఆదాయానికి సంబంధించిన ఆధారాలు ఉంటే అంతకంటే ఎక్కువ బంగారాన్ని కూడా చట్టబద్ధంగా కలిగి ఉండవచ్చు.


