298వ డివిజన్లో డిప్యూటీ కమిషనర్ సుధాంష్ పర్యటన జీహెచ్ఎంసీ పరిధిలోని 298వ డివిజన్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, కాలనీల సమస్యలను పరిశీలించేందుకు డిప్యూటీ కమిషనర్ సుధాంష్ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి స్థానిక సమస్యలను వివరించారు.
రోడ్ల అధ్వాన పరిస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, పార్కుల అభివృద్ధి, కాలనీల్లో మౌలిక వసతుల కొరత తదితర అంశాలను డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న సుధాంష్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ అభివృద్ధికి అవసరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.


