శ్రావణ మాసం వచ్చేసింది.. శుభకార్యాలకు ముహూర్తాలు.. పెళ్లి మండపాలకు భారీ డిమాండ్
తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం శుభకార్యాల సందడి మొదలైంది. ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
ఆగస్టు 16 నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పంచాంగ నిపుణుల ప్రకారం ఆగస్టులో 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో, సెప్టెంబర్‌లో 3, 5, 8, 10 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు.
దీంతో ఇప్పటికే పలువురు కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లను ముందస్తుగా బుక్ చేసుకున్నారు. మరోవైపు పెళ్లిళ్లతో ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల వ్యాపారాల్లోనూ సందడి నెలకొంది.


