ఆగస్టు 15.. ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజు. 1947లో ఇదే రోజున భారత్ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. దాదాపు 200 ఏళ్ల వలస పాలనకు ముగింపు పలుకుతూ స్వేచ్ఛా భారతం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది సమరయోధులు తమ జీవితాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఉద్యమానికి నాయకత్వం వహించగా, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరులు తమదైన మార్గాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.వారి త్యాగాలను స్మరించుకోవడంతో పాటు దేశ ఐక్యత, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ విలువలను గుర్తుచేసుకోవడమే స్వాతంత్య్ర దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ రోజున జాతీయ జెండా ఎగురవేత, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి. స్వాతంత్య్రాన్ని సాధించడం ఎంత గొప్ప విజయమో.. దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమనే సందేశాన్ని ఈ రోజు మనకు గుర్తుచేస్తుంది.



