PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 11:51 am Posted by : News Desk

సొంత ప్రభుత్వంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్.. నిధులు ఇవ్వకుంటే కురుక్షేత్రమే!

మునుగోడు: కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. మునుగోడు సమస్యలను పరిష్కరించి, రావాల్సిన నిధులు కేటాయించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వంతో కురుక్షేత్ర పోరాటం తప్పదని హెచ్చరించారు. బుధవారం మునుగోడులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకే అధిక నిధులు కేటాయించారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే విధానం కొనసాగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌కు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌కు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.

కొడంగల్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం.. ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న మునుగోడు ప్రజల కోసం చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.500 కోట్లు కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పనులు మూడేళ్లుగా ముందుకు సాగకపోవడంతో నల్గొండ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.

చౌటుప్పల్‌లో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు హామీ కూడా నెరవేరలేదని మండిపడ్డారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించి వినతిపత్రాలు అందించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల సమక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే క్రమశిక్షణ చర్యల పేరుతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడంగల్‌కు నిధుల కేటాయింపుపై ప్రశ్నించినందుకు ‘పండబెట్టి తొక్కుతా’ అంటూ వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని హితవు పలికారు. కాంగ్రెస్ పాలనలో మూడేళ్లు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.