కోట్ల విలువైన ఉల్లి కుళ్లిపోయింది.. ప్రభుత్వ గోదాములో దారుణం!
నాశిక్: ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసిన కోట్ల రూపాయల విలువైన ఉల్లి నిల్వలు గోదాముల్లో కుళ్లిపోతున్నాయి. మహారాష్ట్రలోని నాశిక్ లాల్‌గావ్‌లో ఉన్న CWC గోదాములో భారీగా నిల్వ చేసిన ఉల్లికి పురుగులు పట్టి, కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ధరల నియంత్రణలో భాగంగా NAFED, NCCF కొనుగోలు చేసిన సుమారు 1.20 లక్షల టన్నుల ఉల్లి నిల్వలు ఇలా వృథా అవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.
కాగా, కుళ్లిపోయిన ఉల్లిని గోదాము నుంచి తొలగించే పనిలో కార్మికులు మాస్కులు, గ్లౌజులు వంటి రక్షణ పరికరాలు లేకుండానే పనిచేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పంట ఇలా వృథా అవుతుండటంపై రైతులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదాముల్లో నిల్వల పరిస్థితిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.