మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తన రాజకీయ పునఃప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ.. సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తన కొత్త పార్టీకి శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల పక్షాన బలమైన గొంతుకను వినిపించేందుకే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నానని స్పష్టం చేశారు.
పార్టీ పేరు, విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెలలోనే విజయవాడలో ఏర్పాటు చేయనున్న మీడియా సమావేశంలో వెల్లడిస్తానని తెలిపారు. దేశం ఎల్‌నినో ప్రభావం లేకుండా సుభిక్షంగా ఉండాలని కూడా శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

రాజీనామా తర్వాత మారిన నిర్ణయం
గతేడాది రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటానని అప్పట్లో ప్రకటించారు. అయితే కొద్దికాలానికే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తిరిగి రాజకీయాల్లోకి వస్తానని, సొంతంగా మీడియా సంస్థను కూడా ప్రారంభిస్తానని ప్రకటించారు.
అప్పటి నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలోని పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
వైసీపీలోకి తిరిగి వెళ్తారన్న ప్రచారానికి చెక్
ఇటీవల విజయసాయి రెడ్డి తిరిగి వైసీపీలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఆయన గతంలోనే స్పందిస్తూ తనది స్వతంత్ర భావజాలమని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ‘భారత్ జన వికాస్’ పేరుతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా తిరుమలలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనతో ఈ ఊహాగానాలకు తెరపడింది. త్వరలోనే సొంత జెండాతో ఏపీ రాజకీయాల్లోకి విజయసాయి రెడ్డి అడుగుపెట్టడం ఖాయమైంది.