సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సభ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన లోకేశ్, ప్రస్తుతం ఆ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 103కి చేరిందని, కళాశాలకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని తెలిపారు. ప్రత్యేక పథకం కింద ఆళ్లగడ్డ కాలేజీకి కొత్త భవనం, ధ్వంసమైన ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
ఒక్కో డిగ్రీ కళాశాల పూర్తిస్థాయిలో నిర్మించడానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చవుతుందని, దశలవారీగా అన్ని కాలేజీలకు మౌలిక వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని నియమించడంతో పాటు ల్యాబ్స్, కంప్యూటర్లు, బెంచీలను ఎమ్మెల్యే కోటా నిధుల (P4) కింద సమకూర్చుకోవాలని సూచించారు.
175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు
రాష్ట్రంలో గ్రంథాలయాల వ్యవస్థను బలోపేతం చేయడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీ విజయవంతమైందని, రాత్రి 8 గంటల తర్వాత కూడా 300 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు.
ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకరిస్తే గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేయవచ్చని పిలుపునిచ్చారు.

అమరావతి, విశాఖ, రాయలసీమల్లో భారీ లైబ్రరీలు
అమరావతిలో గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, తెలుగు కల్చరల్ సెంటర్‌తో అనుసంధానించి దేశంలోనే అత్యుత్తమ సెంట్రల్ లైబ్రరీని నిర్మించనున్నట్లు లోకేశ్ ప్రకటించారు. త్వరలోనే దీని డిజైన్ ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు.
దీనికి దీటుగా విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీ కేంద్రంగా ఒక జోనల్ లైబ్రరీని, రాయలసీమ కేంద్రంగా మరో అత్యాధునిక జోనల్ లైబ్రరీని అన్ని హంగులతో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పుస్తక పఠనం పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతుందని, వారిని స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌లకు దూరం చేయడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు