తెలంగాణలో కల్తీ నెయ్యి దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా భారీ తనిఖీలు నిర్వహించారు. మొత్తం 130 కేంద్రాల్లో చేపట్టిన సోదాల్లో భారీగా కల్తీ పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు.
అధికారుల తనిఖీల్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు మొత్తం 36 టన్నుల కల్తీ పదార్థాలు పట్టుబడ్డాయి. పామ్ ఆయిల్, వనస్పతి, స్టార్చ్, కృత్రిమ ఫ్లేవర్లను ఉపయోగించి నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నకిలీ నెయ్యిని ‘ప్యూర్ దేశీ నెయ్యి’ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా పూజా కేంద్రాలు, హోటళ్లకు కూడా ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై అధికారులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.