PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 11:49 am Posted by : News Desk

శివుడి విగ్రహంపై నాగుపాము.. అరగంట పాటు అక్కడే!

జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ దశలో ఉన్న శివుడి భారీ విగ్రహంపైకి ఓ నాగుపాము ఎక్కి సుమారు అరగంట పాటు అక్కడే ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

జగిత్యాల మండలం మోరేపల్లి గ్రామంలో నూతనంగా శివాలయ నిర్మాణం జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఓ నాగుపాము విగ్రహం వద్దకు చేరుకుంది.

మొదట విగ్రహం చుట్టూ తిరిగిన పాము.. ఆ తర్వాత క్రమంగా శివుడి విగ్రహంపైకి ఎక్కి మెడ వరకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అక్కడ కొంతసేపు ఉండి రెండుసార్లు పడగ విప్పినట్లు చెప్పారు. సుమారు 30 నిమిషాల పాటు అక్కడే ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ విషయం తెలియడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పలువురు తమ సెల్‌ఫోన్లలో పాము విగ్రహంపై ఉన్న దృశ్యాలను వీడియోలు, ఫొటోలు తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

శివుడి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం కావడాన్ని స్థానికులు భక్తి భావంతో చూస్తున్నారు. ఆలయ నిర్మాణ సమయంలో ఇలా పాము రావడం శుభ పరిణామమని కొందరు భావించారు. పాము వెళ్లిపోయిన అనంతరం విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో నిర్మాణంలో ఉన్న ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.