PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 8:10 am Posted by : News Desk

తెలంగాణ ప్రజలకు ట్రిపుల్ బొనాంజా.. ఆగస్టు 15న మూడు కీలక కార్యక్రమాలు ప్రారంభం

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఒకేసారి మూడు కీలక కార్యక్రమాలను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కొత్త పింఛన్ల మంజూరు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలు.. ఈ మూడు కార్యక్రమాలు ఒకే రోజు ప్రారంభం కానున్నాయి.

క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా.. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్డులను పంపిణీ చేయనున్నారు.

కొత్త స్మార్ట్ కార్డుపై లబ్ధిదారుడి పేరు, చిరునామాతో పాటు క్యూఆర్ కోడ్ ఉండనుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండనున్నాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడికి సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

2.50 లక్షల మందికి కొత్త పింఛన్లు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించింది. అర్హతలను పరిశీలించిన అనంతరం ఎంపికైన వారికి ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లను అందించనుంది.

దాదాపు 2.50 లక్షల మంది కొత్త పింఛన్ లబ్ధిదారులుగా చేరనున్నారు. ఇందులో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితరులు ఉన్నారు. పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

గిగ్ వర్కర్లకు సంక్షేమ చట్టం

ఆగస్టు 15 నుంచే గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, క్యాబ్, గ్రోసరీ డెలివరీ వంటి రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు ఈ చట్టం ద్వారా రక్షణ కల్పించనున్నారు.

వేతన కోతలు, అన్యాయమైన ఆంక్షలు వంటి సమస్యల నుంచి గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించడంతో పాటు వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.