PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 2:08 am Posted by : PRAJA PULSE NEWS

ఛార్జింగ్ అయిపోయిన ఈవీ.. యువతికి అండగా నిలిచిన జవాన్.. వీడియో వైరల్!

సహాయం చేయాలనే మనసుంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయొచ్చని ఓ జవాన్ నిరూపించారు. ఛార్జింగ్ పూర్తవడంతో రోడ్డుపై ఆగిపోయిన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఓ జవాన్ స్వయంగా ఛార్జింగ్ స్టేషన్ వరకు తోసుకెళ్లి ఓ యువతికి సాయం చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వ్లాగర్ దీపికా శర్మ తన ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణిస్తుండగా మధ్యలో ఛార్జింగ్ అయిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ సైనికుడు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఛార్జింగ్ స్టేషన్ వరకు ఈవీని తోసిన జవాన్

యువతి వాహనాన్ని ఛార్జింగ్ స్టేషన్ వరకు తీసుకెళ్లేందుకు జవాన్ స్వయంగా ఈవీని తోశారు. అంతేకాకుండా ఆమెను కారులో కూర్చోబెట్టి.. తాను మాత్రం వాహనాన్ని తోసుకుంటూ ఛార్జింగ్ స్టేషన్ వరకు వెళ్లారు.

ఛార్జింగ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి.. వాహనం పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయారు. జవాన్ చేసిన ఈ సాయం చూసి దీపికా శర్మ భావోద్వేగానికి గురయ్యారు.

‘ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేను’

తనకు కష్ట సమయంలో అండగా నిలిచిన జవాన్‌కు దీపికా శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.

దేశం కోసం విధులు నిర్వహిస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తున్న సైనికులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జవాన్ మానవత్వంతో చేసిన ఈ చిన్న సహాయం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జవాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇదే నిజమైన దేశ సేవ.. మానవత్వం ఇంకా బతికే ఉంది” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.