మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి లైబ్రరీ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
గిర్మాపూర్ బీజేపీ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం కోసం అనేకసార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ధర్నాలు, నిరసనలు నిర్వహించి ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పలుమార్లు అధికారులతో మాట్లాడి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.
ఏప్రిల్ 13న ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించిన వినతిపత్రం అనంతరం అధికారులు సానుకూలంగా స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు ప్రక్రియను ప్రారంభించారని వెల్లడించారు.
ఈ అభివృద్ధి పనులను కొందరు కాంగ్రెస్ నాయకులు తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని బీజేపీ నాయకులు విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన వారి పాత్ర ప్రజలకు బాగా తెలుసని అన్నారు.
రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, పారిశుద్ధ్యం వంటి ప్రతి ప్రజా సమస్యపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
“ప్రజల కోసం ప్రశ్నిస్తాం.. ప్రజల కోసం పోరాడతాం.. శాశ్వత పరిష్కారం సాధించే వరకు వెనక్కి తగ్గం” అని బండి విష్ణు గౌడ్, శ్రీపాల్ రెడ్డి, రాఘవ రెడ్డి పేర్కొన్నారు.