PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 8:51 am Posted by : PRAJA PULSE NEWS

ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన డెలివరీ బాయ్.. వైరల్‌గా మారిన సీసీటీవీ వీడియో

డెలివరీ సిబ్బంది భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఇటీవల జరిగిన షాకింగ్ ఘటన మరువకముందే, మరో డెలివరీ బాయ్ ఓ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఈ నెల 16న ఓ డెలివరీ బాయ్ పార్సెల్ అందించేందుకు ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో యువతి ఒంటరిగా ఉందని భావించి, తలుపును నెట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో యువతి తల్లి అక్కడికి రావడంతో పరిస్థితిని గమనించిన డెలివరీ బాయ్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డవగా, ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఇటీవలి కాలంలో డెలివరీ సిబ్బందికి సంబంధించిన భద్రతా ఉల్లంఘనల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు పూర్తిగా తెరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, వైరల్ అవుతున్న ఈ వీడియోపై అధికారికంగా పోలీసులు లేదా సంబంధిత డెలివరీ సంస్థ స్పందించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు